కలం, కరీంనగర్: కరీంనగర్లోని జ్యోతి నగర్లో ఎం బ్యాంకెట్ హాల్లో తెలంగాణ విమోచన కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచనం- జాతీయ వాదుల పాత్రపై మేధావుల సమావేశం నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మీటింగ్ ఏర్పాటు చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు మేధావులు, వక్తలు మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించినా.. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదన్నారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానం నిజాం కబంధహస్తాల్లో బందీ అయ్యిందని.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన చారిత్రక దినం సెప్టెంబర్ 17 అని గుర్తుచేశారు.
నాటి రాచరిక పాలనలో ప్రజలు అనుభవించిన యాతనలను, అణచివేతలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. దేశ ప్రథమ హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ చారిత్రక విజయం సాధించడం వల్లే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని స్పష్టం చేశారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను, నాటి విమోచన ఉద్యమ వాస్తవాలను మరుగున పడేసేలా కొందరు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని వక్తలు మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా గత పాలకులు ఈ చారిత్రక దినాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకాడారని విమర్శించారు. తెలంగాణ సమాజం సాధించుకున్న స్వేచ్ఛా స్ఫూర్తిని, త్యాగాల చరిత్రను భావితరాలకు, నేటి యువతకు అందించాల్సిన బాధ్యత మేధావులపై, విద్యావేత్తలపై ఉందని అభిప్రాయపడ్డారు. విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రతి గ్రామస్థాయిలో, వార్డుల్లో జాతీయ జెండాలు ఎగురవేసి, విమోచన యోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పోరాట చరిత్రను ప్రతి ఇంటికి తీసుకువెళ్లేందుకు యువత, మేధావులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలలతో పాటు నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మేధావులు, విద్యావేత్తలు, సామాజిక విశ్లేషకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

