కలం, స్పోర్ట్స్ : భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ (Wasim Akram) ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తమ దేశానికి చెందిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూట్యూబర్ ఫుర్కాన్ భట్టికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ మాట్లాడారు. పిఎస్ఎల్ ప్రారంభమై పదేళ్లవుతున్నా ఒక్క సరైన బ్యాటర్‌ను కూడా తయారు చేయలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లీగ్ ద్వారా కొందరు బౌలర్లు వచ్చినప్పటికీ, నాణ్యమైన బ్యాటింగ్ ప్రతిభ వెలుగులోకి రాలేదని తెలిపారు. భారత్‌కు చెందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు తమ లీగ్ నుంచి వచ్చినప్పుడే పాక్ క్రికెట్‌లో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వసీం అక్రమ్‌కు ఐపిఎల్, పిఎస్ఎల్ రెండింట్లోనూ పనిచేసిన అనుభవం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా, మెంటార్‌గా వ్యవహరించి జట్టుకు రెండు టైటిళ్లు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
పిఎస్ఎల్ లోనూ ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ జట్లకు సేవలు అందించారు. పాకిస్థాన్‌లో కొత్త ప్రతిభను వెలికితీయాలంటే క్లబ్ క్రికెట్‌ను వెంటనే పునరుద్ధరించాలని అక్రమ్ స్పష్టం చేశారు. రెడ్ బాల్ క్రికెట్ మెరుగుపడాలంటే కరాచీ, లాహోర్‌లలో పిసిబి చెరో 100 మిలియన్ రూపాయలు ఖర్చు చేయాలని సూచించారు.

