కలం, సోన్: వ్యవసాయ మోటార్ల విద్యుత్ వైర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగల ఆగడాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పది రోజుల క్రితమే ఇదే గ్రామంలో ఇద్దరు వైర్ల దొంగలను పట్టుకున్న రైతులు.. తాజాగా ఆదివారం మరో దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామం (Kadthal Village) లోని ఒర్రె సమీపంలో వడ్యాల నరేష్, దేవోళ్ల మర్రెన్న, దేవోళ్ల రాజేశ్వర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల వైర్లను నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చోరీ చేస్తున్నాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న రైతు మద్దెల సాగర్ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని గమనించి పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి దొంగను అప్పగించారు. ఇప్పటికే సాగునీటి సమస్యలతో సతమతమవుతున్న తమకు విద్యుత్ మోటార్ల వైర్ల చోరీలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న వైర్లను దొంగలు ఎత్తుకెళ్తుండటంతో పంటలకు నీరందించలేని పరిస్థితి నెలకొంటోందని వాపోతున్నారు.

