Mobile Popup Ad
Mobile Popup Ad

వీడిన నల్లగొండ ఫ్యామిలీ హత్య కేసు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండలోని (Nalgonda) సాగర్ రోడ్డు, తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంచలన కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. మొదట ఇదొక సాధారణ అనుమానాస్పద మరణాలుగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన దారుణ హత్యోదంతంగా తేలింది. హసీనా ఆస్తిపై కన్నేసిన ఆమె మొదటి భర్త కుమార్తె, అల్లుడే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్ల (సుపారీ) సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇదిలా ఉంటే.. హత్యకు గురైన వారిలో మహమ్మద్ సుల్తాన్ (45) ప్రకాశం బజార్‌లో బ్యాగుల వ్యాపారి (హసీనాకు మూడో భర్త), హసీనా (40) ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలు, మహమ్మద్ ముజమిల్ (20) ఏసీ టెక్నీషియన్ (సుల్తాన్ మొదటి భార్య కుమారుడు), అక్సరా అలియాస్ అఫోరా (11) 7వ తరగతి విద్యార్థిని (సుల్తాన్ మొదటి భార్య కుమార్తె). అయితే హసీనాకు గతంలో రెండు వివాహాలు కాగా, నల్లగొండకు (Nalgonda) చెందిన సుల్తాన్‌ను ఆమె మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్‌కు కూడా ఇది వరకే వివాహమై భార్య మరణించగా, మొదటి భార్య పిల్లలైన ముజమిల్, అక్సరా‌లతో కలిసి వీరు నల్లగొండలో నివసిస్తున్నారు. అయితే, హసీనా పేరిట దాదాపు కోటి రూపాయల విలువైన ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. ఈ ఆస్తిని తమకు ఇవ్వకుండా, తన మూడో భర్త పిల్లల పేరిట హసీనా వీలునామా రాస్తోందన్న సమాచారంతో ఆమె మొదటి భర్త కూతురు, అల్లుడు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలనే క్రూరమైన ఆలోచనతో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?

ఈ నెల 22న వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజానికి జూన్ 19వ తేదీ అర్ధరాత్రి జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. జూన్ 19న రాత్రి వేళ కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించారు. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల మధ్య కాలంలో ఇంట్లో నుంచి ‘బచావో బచావో’ అంటూ పెద్ద పెట్టున హాహాకారాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. దుండగులు పదునైన ఆయుధాలతో నలుగురిపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఆధారాలు లభించకుండా ఉండేందుకు, మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా శవాలపై దుప్పట్లు కప్పి, బయట ఎవరికీ అనుమానం రాకుండా గేటుకు తాళం వేసి పారిపోయారు.

పలు కోణాల్లో దర్యాప్తు

ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికల ప్రకారం.. ముజమిల్‌కు 16 కత్తిపోట్లు, కుమార్తె అక్సరాకు 9 కత్తిపోట్లు, హసీనాకు 7 కత్తిపోట్లు, సుల్తాన్‌కు 6 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో బీరువా తెరిచి ఉండడం.. సామాన్లు చిందరవందరగా పడి ఉండటంతో తొలుత ఇదొక దోపిడీ దొంగతనంగా నమ్మించే ప్రయత్నం చేశారు. గతంలో కూడా వీరి ఇంట్లో ఒకసారి దొంగతనం జరిగి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరిపి, సాంకేతిక ఆధారాల సాయంతో సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు సభ్యులను, అలాగే హత్యకు సూత్రధారులైన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ పూర్తయితే మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>