కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు నకిలీ ఫైర్ ఎన్వోసీ పత్రాలు (Fake Fire NOCs Scam) సమర్పించిన కాలేజీలపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఐదంతస్తుల లోపు నిర్వహించే కాలేజీలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ తప్పనిసరి కావడంతో హైడ్రా పరిధిలోని కాలేజీలు ఆ విభాగం నుంచి సర్టిఫికెట్ పొందడం అనివార్యంగా మారింది. ఇదంతా ఆఫ్ లైన్ విధానం కావడంతో పలు కాలేజీ నిర్వాహకులు ఈ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్గించారు. హైడ్రా కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలు సమర్పించినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్ బోర్డు ఇప్పటికే ఎనిమిది కాలేజీల అనుమతులను రద్దు చేసింది. ఫోర్జరీకి పాల్పడిన కాలేజీ యాజమాన్యాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
56కు చేరిన సంఖ్య..
ఇప్పటివరకు ఎన్వోసీ సమర్పించిన కాలేజీల జాబితాను హైడ్రాకు అందించి, సర్టిఫికెట్లపై క్లారిటీ ఇవ్వాలని ఇంటర్ బోర్డు కోరింది. వీటిని పరిశీలించిన హైడ్రా బుధవారం తేల్చిన 8 కాలేజీలకు అదనంగా గురువారం మరో 48 కాలేజీలు కూడా ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించింది. దీంతో నకిలీ ఎన్వోసీలు సమర్పించిన కాలేజీల సంఖ్య 56కు చేరుకున్నది. దీనికి తోడు మరో 176 కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన ఎన్వోసీలపైనా హైడ్రా స్టడీ చేస్తున్నది. ఇందులో ఎన్ని ఒరిజినల్.. ఎన్ని ఫోర్జరీ.. అనేది ఒకటి రెండు రోజుల్లో తేలనున్నది.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 లక్షలు..
కాలేజీలకు ఫేక్ ఎన్వోసీ ఇవ్వడానికి కొద్దిమంది బ్రోకర్లు ఒక ‘రాకెట్’గా ఏర్పడి పనిచేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. ఒక్కో ఎన్వోసీ కోసం దాదాపు రూ. 10 లక్షల వరకు ఈ ముఠా వసూలు చేసినట్లు అంచనా. ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్లను రూపొందించిన వ్యక్తులు, వాటిని సమర్పించిన కాలేజీ యాజమాన్యాల మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు దృష్టి సారించారు. ఆ యాజమాన్యాలను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయన్నది పోలీసులు అభిప్రాయం. హైడ్రా నివేదిక, పోలీసుల విచారణలో బయటపడ్డ అంశాలను ఆధారంగా చేసుకుని కాలేజీ యజమాన్యాలపై ఫోర్జరీ, నకిలీ పత్రాల వినియోగం, మోసం తదితర అభియోగాల కింద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

