రాష్ట్ర రోడ్లన్నింటికీ ఒకే యూనిఫామ్ సిస్టమ్.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రధాన రోడ్ల నెట్‌వర్క్ మొత్తాన్ని ఒకే సిస్టమ్‌లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. రోడ్లకు సంబంధించిన అంశాలన్నింటికీ ఒక యూనిఫామ్ సిస్టమ్‌ను రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి చేపట్టే భూసేకరణ, తీసుకునే రుణాలు, రోడ్ల నిర్వహణ.. ఇలాంటి అంశాలన్నీ ఈ సిస్టమ్‌లోకి తీసుకురావాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్లు ఈ వ్యవస్థ పరిధిలోకి రావాలని తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేదని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నారని, ఎక్కడిక్కడ వాహనాలను నిలపడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు

టీడీఆర్‌పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ (ట్రాన్సఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) చేయాలని, ఈ ప్రక్రియను మొత్తం ఆన్‌లైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా వ్యవస్థను రూపొందించాలన్నారు.

రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్ నెంబర్ 1 ను డిసెంబర్ 9 లోగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు నిర్మాణం నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా రోడ్డు నిర్మాణంలో వాడే మట్టిపైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్‌లకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా చూసుకోవాలని చెప్పారు.

బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకమని ప్రస్తావించిన సీఎం.. ఎలేవేటెడ్ కారిడార్స్ నెంబర్ 1, 11 పనులు వేగవంతం చేయాలన్నారు.

ల్యాండ్ పూలింగ్‌లో నో మీడియేటర్స్

ఎలేవేటెడ్ కారిడార్ నెంబర్ 111 బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు రోడ్ల అభివృద్ధి పైనే ఆధారపడి ఉందని, ఇందుకు అవసరమైన భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. అధికారులు అలసత్వం చూపించొద్దని వార్నింగ్ ఇచ్చారు.

రోడ్ల ప్లానింగ్, నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమీక్షకు పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>