కలం, వరంగల్ బ్యూరో: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో నకిలీ వైద్యుల మాఫియా (Fake Doctors Racket) ప్రజారోగ్యానికి పెను ముప్పుగా తయారైంది. వైద్య విద్య, రిజిస్ట్రేషన్ లేకుండానే కొందరు వైద్యం చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. దశాబ్దాలుగా నడుస్తుండగా గమనార్హం. తాజాగా గురువారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) ప్రత్యేక తనిఖీల్లో 16 మంది నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేయడంతో తీవ్రతను మరోసారి బయటపెట్టింది.
టీజీఎంసీ బృందాలు వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో వైద్య అర్హతలు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిని గుర్తించాయి. కొందరు ఇతర వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లను దుర్వినియోగం చేస్తూ చికిత్స అందిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఒక వైద్యురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రధాన నిందితుడు రుద్ర భాస్కర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.
గ్రామాలే దందా కేరాఫ్
గ్రామాలనే నకిలీ వైద్యుల కేరాఫ్ అడ్రస్ గా చేసుకున్నారు. చిన్న క్లినిక్‌లు ప్రారంభించి జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, డెలివరీలు, పిల్లల వ్యాధులు, సెలైన్‌లు, ఇంజెక్షన్లు వంటి చికిత్సలు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించడం, అప్పటికే విలువైన సమయం వృథా కావడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ఉంటున్నాయి.
జనగామ ఘటన తర్వాత కూడా మారని పరిస్థితి
ఇటీవల జనగామ జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, చట్టవిరుద్ధ గర్భస్రావాల కేసులో పలువురు అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరోగ్య శాఖ, పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ నెట్‌వర్క్ పూర్తిగా అంతరించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కేసులు వెలుగులోకి రావడం వల్ల నకిలీ వైద్యులు, మధ్యవర్తులు, కొన్ని అక్రమ వైద్య సేవల మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలపై దర్యాప్తు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైద్యం చేయించుకునే ముందు సంబంధిత వైద్యుడికి చెల్లుబాటు అయ్యే అర్హతలు, రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలని టీజీఎంసీ అధికారులు సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో చికిత్స పేరుతో నకిలీ వైద్యులను ఆశ్రయించడం ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.
కేసులు నమోదు.. కొత్త పేర్లతో దందా మొదలు
గతంలో కూడా ఉమ్మడి జిల్లాలో పలుమార్లు నకిలీ వైద్యులపై కేసులు నమోదయ్యాయి. మళ్లీ కొత్త పేర్లు, బోర్డులతో క్లినిక్‌లు ప్రారంభించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం కేసులు నమోదు చేయడం కాకుండా, అక్రమ క్లినిక్‌లను శాశ్వతంగా మూసివేయడం, తరచూ తనిఖీలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు అవసరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

