కలం, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala)లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను కొందరు కేటుగాళ్లు నిలువు దోపిడీ చేసేస్తున్నారు. ఇప్పటికే నకిలీ దర్శనం టోకెన్ల బాధితుల సంఖ్య పెరిగిపోతుంటే తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD) తక్కువ ధరకే గదులు అద్దెకు ఇస్తుందన్న విషయం తెలిసిందే. భక్తులు ఆధార్ కార్డుతో పాటు రూ.50, రూ.100 చెల్లించి ఈ గదులు తీసుకుంటారు. అయితే కొందరు మోసగాళ్లు నకిలీ ఆధార్ కార్డుల (Fake Aadhaar Cards)తో రూంలు బుక్ చేస్తున్నారు.
ఆ తర్వాత భక్తులకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు అమ్ముతున్నారు. ఇక గదులు ఖాళీ లేని సమయంలో వేరే ఆప్షన్ లేక భక్తులు కూడా అధిక డబ్బు చెల్లించి గదులు తీసుకుంటున్నారు. ఈ విషయం టీటీడీ విజిలెన్స్ దృష్టికి రావడంతో పోలీసులతో కలిసి నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 12 నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. భక్తులు దర్శన టికెట్లు అయినా, గదులు అయినా అధికారికంగానే బుక్ చేసుకోవాలని, మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

