కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ (Parliament) సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై విదేశాంగ మంత్రి జై శంకర్ (Jaishankar) పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్ ఇంధన అవసరాల అంశంలో పశ్చిమాసియా కీలకంగా ఉందని జై శంకర్ పేర్కొన్నారు టెహ్రాన్‌లోని భారతీయులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసినట్లు వెల్లడించారు. భారతీయుల భద్రతకు కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. జై శంకర్ ప్రసంగిస్తున్నంత సేపు ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూనే ఉన్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్‌లో అత్యంత ఆందోళన నెలకొందని జై శంకర్ చెప్పారు. పశ్చిమాసియా స్థిరంగా ఉండటం భారత్‌కు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఇరాన్‌లో కూడా చదువు, ఉపాధి కోసం కొన్ని వేల మంది భారతీయులు నివసిస్తున్నారని వెల్లడించారు. భారత్‌కు చమురు, గ్యాస్ సరఫరా చేసే దేశాలన్నీ మిడిల్ ఈస్ట్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఘర్షణలు రోజురోజుకీ మరింత ముదురుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రత లేకుండా పోయిందని వాపోయారు.
విధ్వంసం పెరుగుతూ ఈ గొడవలు ఇతర దేశాలకు కూడా పాకుతున్నాయని జై శంకర్ చెప్పారు. దీని వల్ల సాధారణ ప్రజల జీవనం విధానం, కార్యకలాపాలు దెబ్బతింటున్నాయన్నారు. భారతీయుల భద్రతకు, శాంతికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని జైశంకర్ వివరించారు. విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తున్నప్పటికీ జై శంకర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోవైపు, పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. విపక్షాల గొంతు నొక్కడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపడమేనంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

