బౌలింగ్‌లో బుమ్రా ఒక బ్రాడ్‌మాన్: ఆకాశ్

కలం, స్పోర్ట్స్​​ : ప్రపంచ క్రికెట్‌లో బ్యాటింగ్‌కు డాన్ బ్రాడ్‌మాన్ ఎలాగో.. బౌలింగ్‌కు జస్ప్రీత్ బుమ్రా అలా మారిపోయాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) కొనియాడారు. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై బుమ్రా చేసిన మ్యాజిక్ స్పెల్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. కివీస్ బ్యాటర్లను తన బౌలింగ్ స్పెల్స్‌తో బెంబేలెత్తించాడు. అతి తక్కువ రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుని తన మార్క్ చూపించుకున్నాడు.

అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కివీస్ విలవిలలాడింది. కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. టీమిండియా 96 పరుగుల భారీ విజయం అందించడంలో కీలకంగా మారాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆటపై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ప్రశంసలు వర్షం కురిపించాడు. బుమ్రా బౌలింగ్‌కు వరల్డ్ క్లాస్‌ను దాటేసిందన్నారు. బుమ్రా నిలకడను బ్రాడ్‌మాన్‌తో పోల్చారు. బుమ్రాకు ఎప్పుడూ ‘ఆఫ్ డే’ ఉండదని, అతను ఒక అద్భుతమైన మేధావి అని పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా తన వ్యూహాన్ని మార్చుకున్నారని చోప్రా వివరించారు. ఎప్పుడూ యార్కర్లతో విరుచుకుపడే బుమ్రా.. ఈసారి స్లోయర్ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించారని చెప్పారు. వేగంగా బౌలింగ్ చేసి బోర్ కొట్టిందేమో అందుకే వేళ్లను తిప్పుతూ వికెట్లు తీశారని వ్యాఖ్యానించారు. బుమ్రా వేసిన తొలి బంతికే రచిన్ రవీంద్ర ఇషాన్ కిషన్‌కు చిక్కగా.. ఆ తర్వాత నీషమ్, మ్యాట్ హెన్రీ, సాంట్నర్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారని తెలిపారు. అంతర్జాతీయ టీ20ల్లో బుమ్రా 4 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రత్యర్థి బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారని చోప్రా విశ్లేషించారు. బంతి బుమ్రా మాట వింటున్నట్లు అనిపిస్తుందని, అతను ఎక్కడ పిచ్ చేయమంటే అక్కడ పడుతుందని అన్నారు. గణాంకాల ప్రకారం బుమ్రా వేసే స్లాట్ బంతుల్లో కూడా బ్యాటర్ల స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉందని, వారు కేవలం వికెట్ కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మిగతా ఆటగాళ్లకు సమయం వస్తుందేమో కానీ.. బుమ్రాకు మాత్రం ఇది ఒక సువర్ణ యుగమని అభివర్ణించారు. బుమ్రా వంటి బౌలర్ భారత్‌కు ఉండటం మన అదృష్టమని, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను వేసిన 18వ ఓవర్ వల్లే భారత్ ఫైనల్‌కు చేరిందని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>