కలం వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జిల్లాలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి(Ex MLA Rajender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం కేతన్‌పల్లిలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను సన్మానించి మాట్లాడారు. రాష్ట్రంలో 12 జిల్లాలు రద్దు అయ్యే అవకాశం ఉందని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాల క్రమబద్ధీకరణ పేరుతో నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా కోసం ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చాడని, ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని పేర్కొన్నారు.


