కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (Editors Guild) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్టీవీ ప్రసారం చేసిన ఒక వీడియో విషయంలో నిబంధనలకు విరుద్ధంగా జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని పేర్కొన్నది.
ఎన్టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఎవరి పేర్లను ప్రస్తావించనప్పటికీ, తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఎడిటర్స్ గిల్డ్ (Editors Guild) పేర్కొంది. బాధిత మహిళా అధికారిణి నేరుగా ఫిర్యాదు చేయకపోయినా, అధికారుల సంఘం కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే క్రిమినల్ డిఫమేషన్ కేసులు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేసి, వారిని అరెస్టు చేసి కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు లాకప్‌లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పోలీసులు కనీస న్యాయ ప్రక్రియను అనుసరించలేదని పేర్కొన్నది.


