Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర మంత్రికి మాజీ మేయర్ రవీందర్ సింగ్ సవాల్!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగర ప్రజలు ప్రతిరోజూ డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగ, మంటలు, దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని మాజీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ మేయర్, కార్పొరేటర్ రవీందర్ సింగ్ (Ravinder Singh) ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, సర్పంచులు, ముఖ్యనేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం లేవగానే పొగతో నిండిన నగరాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా డంపింగ్ యార్డ్ చెత్తను వేరు చేయడం, సిగ్రిగేషన్, తరలింపుకు రూ.2 కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదని మండిపడ్డారు.

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వారికే మళ్లీ అవకాశాలు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూ.2 కోట్ల టెండర్లను సైతం కావాలనే పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. “అధికారుల చేతులకు ఏమైనా రోగం పుట్టిందా? టెండర్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. టెండర్లు ఓపెన్ కాకపోవడానికి ప్రధాన కారణం ప్రస్తుత టెండర్లలో ‘పే మిషన్’ లేకపోవడమేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అర్హతలు లేని వారికి కూడా పనులు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నగర ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని విమర్శించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌లు డంపింగ్ యార్డును సందర్శించినా పరిష్కారం కనిపించలేదని పేర్కొన్నారు. “ఎవరికి కట్టబెట్టాలో వారికి టెండర్ వచ్చేవరకు నగర ప్రజలను ఇలాగే పొగలో కాల్చేస్తారా?” అంటూ ప్రశ్నించారు. వెంటనే టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ఇటీవల నగరంలో ఒక కార్పొరేటర్ కుటుంబ సభ్యుడిని అరెస్టు చేసిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రజల సమస్యల కోసం నిలదీస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తమ డివిజన్‌లో మరణించిన వ్యక్తి అంత్యక్రియల కోసం అధికారులు స్పందించకపోవడంతో ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఎస్‌ఈ అవినీతిపై తాను సాక్ష్యాధారాలతో FIR ఇచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. అరెస్టులు లేవు, నోటీసులు లేవు, విచారణ లేదు కానీ ప్రశ్నించే వారిపై మాత్రం కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కార్పొరేటర్ అరెస్టులో చూపిన ఉత్సాహం అవినీతి అధికారులపై కూడా చూపించాలని పోలీసు శాఖను కోరారు. “ఉద్యమం ఏదైనా కరీంనగర్ నుంచే మొదలవుతుంది” అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. అవినీతి చేయలేదని కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రమాణం చేయించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకు రావాలని సవాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>