కలం, వరంగల్ బ్యూరో : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Minister Uttam) మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Dayakar Rao) ఫోన్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి నీళ్లందించి రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామ పంచాయతీ పరిధి మల్యా తండా, లకావత్ తండాలో సోమవారం పర్యటించిన దయాకర్ రావు.. ఎండిన వరి పంటలను పరిశీలించారు. రైతులు రాందాన్, యాకు, సోమ్లా, పూల్యలతో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి.. స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి వచ్చే 4L కాలువకు నీళ్లు విడుదల చేయాలని దయాకర్ రావు కోరారు. ఆయన విజ్ఞప్తిపై ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండేదని.. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాగునీరు లేక రైతుల పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. యూరియా దొరకక షాపుల ముందు రోజుల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలకు నీళ్లు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో నష్టపరిహారం కింద ఎకరాకు 30 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల బిఆర్ఎస్ నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Read Also: వెలుగుమట్ల బాధితులకు పొంగులేటి గుడ్‌న్యూస్
Follow Us On: Instagram

