కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (Employees JAC) ఆధ్వర్యంలో మే 5వ తేదీన నిర్వహించనున్న ఒక్కరోజు నిరాహార దీక్షను విజయవంతం చేయాలని, ప్రతి ఉద్యోగి పాల్గొనాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పిలుపునిచ్చారు. ఎంప్లాయిస్ జేఏసీ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి చేరవేసి సమర్థవంతంగా అమలు చేసే వారు ప్రభుత్వ ఉద్యోగులేనని, అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, అనేక కీలక సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డీఏలు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, ఐదు సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాల్సిన పీఆర్సీ వంటి హక్కులను కాలానుగుణంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2023 జూన్ 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం ఇంటరిమ్ రిలీఫ్‌తోనే ఉద్యోగులను సరిపెడుతున్నారన్నారు.
పెండింగ్‌లో డీఏలు
అలాగే 2024 జూలై నుండి 2026 జనవరి వరకు రావాల్సిన ఐదు డీఏలను పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు, సరెండర్ లీవ్ బిల్లులు, టీజీఎల్ఐఎఫ్ ఇన్సూరెన్స్ బిల్లులు, వివిధ రకాల ఏరియర్స్ సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఓపీఎస్ పునరుద్ధరణపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, సీపీఎస్ రద్దుపై ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హెల్త్ కార్డు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎంపానెల్డ్ హాస్పిటల్స్‌ను ఖరారు చేయకపోవడం వల్ల ఉద్యోగులు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌లో జరుగుతున్న జాప్యంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగులందరిదీ ఒకే స్వరం
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ ఒకే స్వరంతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగే మే 5 నిరాహార దీక్ష కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ కటకం రమేశ్, పెండ్యాల కేశవ రెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకులు తిరుపతిరావు, జయపాల్ రెడ్డి, సుంకిశాల ప్రభాకర్ రావు, చింతపల్లి, అశోక్, జైపాల్‌రెడ్డి, కోట రామస్వామి, శంకర్, జాలి మహేందర్ రెడ్డి, జకోజి వెంకటేశ్వర్లు, చంద్రమౌళి వివిధ సంఘాల సంబంధించిన నాయకులు డాక్టర్ అరవింద్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, శారద, సునీత, సరిత, సబిత, సుస్మిత, శైలజ, రాగి శ్రీనివాస్, రమేష్ గౌడ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, పోలు కిషన్, వెలిచాల సుమంతరావు, రోహిత్, వెంకట్ రెడ్డి, తాళ్ళపెల్లి రాంమోహన్, బోనాల రవి, వంశీ, రమేష్, లవ కుమార్, కరుణాకర్, జీనన్, ఆనందం, తదితరులు పాల్గొన్నారు.

