కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై (Employee Transfer) ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 38ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మే 1, 2026 నుంచి మే 31, 2026 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. 2026 జనవరి 1 నాటికి ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు బదిలీలకు అర్హులు. ఒకే చోట నాలుగేళ్లు పూర్తి చేసుకున్నవారిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. అయితే మే 31, 2027 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. వారు కోరుకుంటే తప్ప వారిని బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు (స్పౌజ్ కేసులు) మూడేళ్ల నిబంధన నుంచి మినహాయింపు కల్పించారు.
బదిలీల్లో ప్రాధాన్యత క్రమం
బదిలీల కేటాయింపులో ప్రభుత్వం స్పష్టమైన ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించింది. ఒకే స్థానం కోసం ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినప్పుడు మొదటగా భార్యాభర్తల కేసులకు, ఆపై త్వరలో రిటైర్ అయ్యేవారికి, 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్నవారికి, వితంతువులకు, క్యాన్సర్, కిడ్నీ/లివర్ మార్పిడి, గుండె శస్త్రచికిత్స లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అవకాశం కల్పిస్తారు. మెడికల్ గ్రౌండ్స్‌లో బదిలీలు పొందినవారి వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత మొదటిసారిగా సాధారణ బదిలీలకు (Employee Transfer) అనుమతి ఇచ్చింది. కష్టతరమైన ప్రాంతాల్లో ఎక్కువ కాలం సేవ చేసిన ఉద్యోగిని బదిలీ అయ్యేలా అవకాశం కల్పించింది. ప్రతి డిపార్ట్‌మెంట్ తన ఉద్యోగులకు కష్టతరమైన ప్రాంతాలను గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్
Follow Us On: Instagram

