కలం, జడ్చర్ల: మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల (Jadcherla) మున్సిపల్ పరిధిలోని పద్మావతి కాలనీలో అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఫారం-18లను పంపిణీ (Form-18 Distribution) చేశారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పించడం జరిగిందని బీజేపీ నాయకులు అమర్నాథ్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ పనిచేయడం లేదని తెలిపారు. కాబట్టి అర్హులైన గ్రాడ్యుయేట్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆఫ్లైన్ విధానంలో ఫారం-18 ద్వారా తమ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జడ్చర్ల పట్టణ అధ్యక్షులు ఎడ్ల అమర్నాథ్ గౌడ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు వెంకట్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

