కలం, నాగార్జునసాగర్ : గాలి వానల ప్రభావంతో నందికొండ (Nandikonda) మున్సిపాలిటీలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఓ విద్యుత్ స్తంభం విరిగి (Electric Pole Collapse) ప్రజలు రాకపోకలు సాగించే రహదారిపై పడిపోవడంతో స్థానికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
స్థానికుల కథనం ప్రకారం, స్తంభం కూలిపడటంతో పాటు విద్యుత్ తీగలు కూడా రోడ్డంతా చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో కరెంటు ప్రవహించి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గాలి వానలతో విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, సమస్య పరిష్కారం కోసం సంప్రదించాల్సిన సబ్‌స్టేషన్ ఫోన్ నంబర్‌లు (87124 87605) స్విచ్ ఆఫ్‌లో ఉండడం మరింత ఆగ్రహానికి దారితీసింది. అత్యవసర సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల స్థానికులు తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ట్రాన్స్‌కో పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బతిన్న విద్యుత్ సదుపాయాలను వెంటనే పునరుద్ధరించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ‘అత్యవసర సేవలు ప్రజల కోసం ఉంటాయి. అలాంటి సమయంలో అధికారులు అందుబాటులో లేకపోతే ప్రజల భద్రత ఎవరి చేతుల్లో ఉంటుంది?’ అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తత మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక
Follow Us On : WhatsApp

