కలం, వెబ్ డెస్క్: సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కమిషనర్లే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఏ నిర్ణయం తీసుకునే ముందు సంస్థలోని వ్యక్తులు భిన్నాభిప్రాయాలు, రకరకాల సూచనలు చేయడం సహజమేనని స్పష్టం చేసింది. కేవలం ముగ్గురు ఎన్నికనర్లే కాకుండా.. ఎన్నికల సంఘంలోని ప్రతి అధికారికి తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంది.
ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తరచూ అనేక ఆదేశాలు జారీ చేస్తూ వస్తోందని ఎన్నికల సంఘం తెలిపింది. సుమారు 40 రకాల కొత్త కార్యక్రమాలు, ఎన్నికల సంస్కరణలు చేపట్టిందని గుర్తు చేసింది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించింది. ఇవన్నీ ఏకగ్రీవంగా కమిషన్ తీసుకున్న నిర్ణయాలేనని చెప్పుకొచ్చింది. కేవలం గత కొంత కాలంగా జరిగిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం సరికాదని.. అంతకుముందు తీసుకున్న నిర్ణయాలను కూడా పరిశీలించాలని సూచించింది.
అసలేం జరిగిందంటే..
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్లు సఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెలువరించింది. కొన్ని నిర్ణయాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తమకు తెలియకుండానే తీసుకుంటున్నారని భావనలో ఉన్నట్లు పేర్కొంది. అంతేగాకుండా, ఏకంగా కేబినెట్ సెక్రటరీకి కూడా ఇదే విషయమై సమాచారం అందించినట్లు రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కథనాన్ని ఖండిస్తూ ఈసీ వివరణ ఇచ్చింది.

