కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఓ వృద్ధురాలు కలెక్టరేట్‌కి వచ్చి ప్రజావాణిలో తన వ్యవసాయ భూమి ఆక్రమణ గురవుతుందని ఫిర్యాదు చేశారు. వృద్ధురాలినని ఏమీ చేయలేనని చుట్టుపక్కల ఉన్న వారు మా వ్యవసాయ భూమి ఆక్రమిస్తున్నారని ఇండ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ మండలం పాంగ్ర గ్రామానికి చెందిన రాజమణి అనే వృద్ధురాలు ప్రజావాణిలో జెసి భుజంగరావుకు వినతి పత్రం సమర్పించారు.
తన భర్త మల్లయ్య చనిపోయాక మాకు ఉన్న ఒక ఎకరం 39 గుంటల వ్యవసాయ భూమి తన పేరు మీద వారసత్వ హక్కుగా సంక్రమించిందని తెలిపారు. ఆక్రమణలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాళ్లకు ఆపరేషన్ అయి నడవలేని స్థితిలో ఉన్నానని కనికరించి సర్వే నిర్వహించి భూమి హద్దులు తేల్చాలని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

