కలం, కరీంనగర్ బ్యూరో : నగరంలోని సెవన్ హిల్స్ వద్ద గల సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender) క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం ముకరంపురలోని ఆయన కార్యాలయంలో నరేందర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలపాలని తాము భావించామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హల్ద్వానీలో పర్యటించిన ప్రాంతాన్ని కొందరు శుద్ధి చేసి అంటరానితనాన్ని ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై కరీంనగర్ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమాధానం చెప్పాలని తాము డిమాండ్ చేస్తుంటే, బీజేపీ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఒత్తిడి మేరకే నిన్నటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, మైనారిటీ సెల్ జిల్లా మరియు నగర అధ్యక్షులను, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఓటు హక్కు, అంశాలపై ప్రశ్నించిన వారందరినీ దేశద్రోహులుగా బండి సంజయ్ అభివర్ణించడం సరికాదని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో హక్కుల గురించి మాట్లాడే వారంతా దేశద్రోహులు అవుతారా? అని నిలదీశారు.

