కలం, వెబ్ డెస్క్ : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని (Sri Sathya Sai Baba Jayanti) అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సత్యసాయి బాబా సేవలు, ఆధ్యాత్మిక బోధనలు, సమాజానికి ఆయన అందించిన విశేష కృషిని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
నవంబర్ 23న సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, భారతీయ సమాజంపై ఆధ్యాత్మికంగా చెరగని ముద్ర వేసిన మహనీయుడు సత్యసాయి అని కొనియాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి లక్షలాది మందికి సేవలందించిన సత్యసాయి గొప్ప మానవతావాది అని మంత్రి అభివర్ణించారు. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఆయన సాగించిన సేవా కార్యక్రమాలు నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. సత్యసాయి బోధనలు, సేవా మార్గాన్ని సమాజంలో మరింత విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, యువతకు ఆదర్శంగా నిలిపేందుకు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని నారా లోకేశ్ పేర్కొన్నారు.

