జిల్లాల మధ్య తగాదాలు వద్దు: సీపీఐ నేత బాల న‌ర‌సింహ‌

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: పాలమూరు, నల్గొండ జిల్లాల మధ్య సాగునీరు, తాగునీటి విషయంలో తగాదాలు సృష్టించడం మాని, తక్షణమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (Palamuru-Rangareddy Project) జాతీయ హోదా కల్పించేందుకు బీజేపీ ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ (Bala Narasimha) డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లా సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల కోసం జిల్లాల మధ్య తగాదాలు సృష్టించడం మాని, జాతీయ హోదా తీసుకురావడం కోసం అఖిలపక్ష కమిటీ సభ్యులను ఢిల్లీకి తీసుకొని వెళ్లాలని కోరారు. జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో జిల్లా ప్రజలకు తెలియజేయాలని ఎంపీని ప్రశ్నించారు.

అదేవిధంగా జిల్లాకు రావాల్సిన నీటి వాటా హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. కార్మిక, కర్షక, పేద రైతుల హక్కుల కోసం అలుపెరుగని ఉద్యమాల ద్వారా ప్రపంచ దేశాలైన సెర్బియా, బ్రెజిల్ తదితర దేశాలలో కమ్యూనిస్టులు అఖండ విజయాలు సాధిస్తుండడం శుభపరిణామమని, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదం, మతోన్మాద రాజకీయ విధానాలకు అంతం పలికే దిశగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలపై చూపిస్తున్న శ్రద్ధను కరువు జిల్లాల ప్రజా సమస్యలపై చూపడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 33 జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పశువులకు దాణా, పశుగ్రాసం కొరతను తీర్చాలని కోరారు. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించకపోతే కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్ మాట్లాడుతూ.. జిల్లాలో త్రాగునీరు, సాగునీరు పట్టణంలో ఉన్న డంపింగ్ యార్డ్, భూ కబ్జాలపై తదితర సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, కొండపల్లి రాము, పి. సురేష్, కె. పద్మావతి, కౌన్సిల్ సభ్యులు భాష, ఆంజనేయులు, సత్యనారాయణ రెడ్డి, అమర్ జ్యోతి, మహేష్ బాబు, దేవానంద్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>