epaper
Sunday, February 22, 2026
epaper

ఎదులాపురంలో ప్రభుత్వ భూములు కబ్జా: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మున్సిపల్ పాలక వర్గాల బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఎదులాపురం మున్సిపాలిటీ కబ్జా సమస్యలతో పాటు మౌలిక సదుపాయాల కొరతతో సతమతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. స్థానిక సమస్యలను కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు వార్డుల్లో పర్యటించి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. మరో 15 రోజుల్లో మళ్ళీ సమావేశమై సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేద్దామని పిలుపునిచ్చారు.

రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత అన్ని పార్టీలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. తదుపరి సమావేశంలో కౌన్సిలర్లందరికీ ఐదు నిమిషాల చొప్పున మాట్లాడే అవకాశం కల్పించి వార్డుల సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. అందరం కలిసి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించుకుందామని మంత్రి తెలియజేశారు.

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

అనంతరం సత్యనారాయణపురంలో ఓ లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకకు మంత్రి హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులను అభినందించిన మంత్రి, వారికి ఆత్మీయంగా పట్టు వస్త్రాలను బహూకరించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>