Mobile Popup Ad
Mobile Popup Ad

డైట్‌ల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని డైట్ (డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్), ఐఏఎస్ఈ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్), సీఈటీ (కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్), ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రెయినింగ్) తదితర సంస్థల్లో లెక్చరర్ (Lecturer) పోస్టుల భర్తీ కోసం విద్యా శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేసేంత వరకు తాత్కాలిక విధానంలో ఇన్-సర్వీస్ టీచర్లను అర్హతలకు అనుగుణంగా నియమించాలని భావించింది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది.

వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొత్తం 202 పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నది. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నెలకొన్న అధ్యాపకుల కొరతను అధిగమించడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. మొత్తం ప్రక్రియను ఆగస్టు 10వ తేదీకి పూర్తి చేయాలన్నది విద్యాశాఖ లక్ష్యం.

కంప్యూటర్ బేస్ టెస్ట్ ప్రకారం భర్తీ..

విద్యా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం డైట్‌ కాలేజీల్లో 131 పోస్టులు, సీటీఈల్లో 36, ఐఏఎస్‌ఈలలో 17, ఎస్‌సీఈఆర్‌టీలో 18 చొప్పున మొత్తం 202 పోస్టుల భర్తీ జరగనున్నది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ నోటిఫికేషన్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ నవీన్ నికొలస్ తెలిపారు.

ఎంపిక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, బోధనా ప్రదర్శన (డెమోన్‌స్ట్రేషన్) ఆధారంగా జరగనున్నదని తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు, అకడమిక్ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు లేదా సంవత్సరం పాటు తాత్కాలికంగా డిప్యుటేషన్ ద్వారా అధ్యాపకులను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

జిల్లా స్థాయిలో స్పెషల్ కమిటీల ఏర్పాటు..

ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు నికొలస్ తెలిపారు. డైట్‌లు, సీటీఈలు, ఐఏఎస్‌ఈలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పనిచేస్తాయని, ఎస్‌సీఈఆర్‌టీ ఎంపికలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్నదని తెలిపారు.

డిప్యుటేషన్‌పై ఎంపికయ్యే ఉపాధ్యాయులకు ప్రస్తుతం పొందుతున్న వేతనమే కొనసాగుతుందని, లెక్చరర్ లేదా ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన అదనపు వేతన ప్రయోజనాలు వర్తించవని ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఈ నియామకాల ద్వారా సీనియారిటీ లేదా రెగ్యులరైజేషన్ హక్కు ఉండదని, అభ్యర్థులు అందుకు సంబంధించిన అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సిబ్బంది స్థానంలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారు బాధ్యతలు చేపట్టిన వెంటనే పాత డిప్యుటేషన్లు రద్దవుతాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>