Mobile Popup Ad
Mobile Popup Ad

100 మార్కులు కాదు.. సంస్కారంతో పెరగడం గర్వకారణం: ఈటల

కలం, వెబ్ డెస్క్: భారతదేశంలో “సర్వేజనా సుఖినోభవంతు” అనే సంస్కృతి మనదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. మన పిల్లలకు 100 మార్కులు వస్తే గర్వించదగ్గ విషయం కాదని.. సంస్కారంతో పెరగడం గర్వకారణమని పేర్కొన్నారు. చదువుతోపాటు విలువలు కూడా పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో అనేక సమస్యల పరిష్కారం పిల్లలు మాత్రమే చేయగలరని.. అందుకే వారిని తల్లిదండ్రులు సరైన మార్గంలో నడిపించాలన్నారు. విద్యార్థుల ఎదుగుదలలో కుటుంబం.. కుటుంబాల ఎదుగుదలలో దేశం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

దేశంలో జరుగుతున్న అశాంతిని దూరం చేయడం మన ఇంటి నుంచే మొదలు కావాలని ఎంపీ అభిలషించారు. ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచమంతా ఇబ్బంది పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరుగుతున్న “యూనిఫైడ్ కౌన్సిల్ అవార్డ్స్ (Unified Council Awards)” కార్యక్రమంలో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒలింపియాడ్ పేరుతో 10 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష పెట్టి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు. అవార్డులు పొందిన ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

దేశాన్ని 3వ స్థానానికి తీసుకురావడానికి మోదీ కృషి..

ఈ సందర్భంగా ఈటల (Eatala) మాట్లాడుతూ.. కొటారి, అబ్దుల్ కలాం, నరేంద్ర మోదీ ఇలా ఎవరు చెప్పినా తరగతి గదిలోనే దేశం భవిష్యత్తు ఉందని, విద్యార్థుల మేధోసంపత్తితోనే దేశం ముందుకు పోతుందనేది అక్షర సత్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు బాలురకు మాత్రమే విద్య పరిమితమయ్యేదని.. కానీ సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల వల్ల అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారని ఈటల కొనియాడారు. రీసెర్చ్ ఇన్నోవేషన్ గురించి ఆలోచన చేయకపోతే దేశం ముందుకు పోదని చెప్పారు. ఎన్నో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు దేశంలో నడుస్తున్నాయని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్న భారత దేశం అత్యంత వేగంగా దూసుకుపోతుందని తెలిపారు. ప్రధాని మోదీ దేశాన్ని 3వ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని.. ఆ వేగం చూసి ఇతర దేశాలు ఈర్ష పడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుధాకర్ గండే, శ్రీనివాస్ రావు , K.V ప్రదీప్, కల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: భయంకరమైన ఎల్ నినో.. మళ్లీ రాబోతుందా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>