కలం, స్పోర్ట్స్ : దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఆసక్తికర సీన్ కనిపించింది. ఈస్ట్ జోన్ 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతుండగా.. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) అతడిని స్లెడ్జింగ్ చేశాడు. ఈ ఘటన తర్వాత కొద్దిసేపటికే వైభవ్ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో ఈ సీన్ ఇప్పుడు చర్చగా మారింది. చెన్నైలో మ్యాచ్ మొదలైన వెంటనే వైభవ్ (Vaibhav Sooryavanshi) తన మార్క్ చూపించాడు. సౌత్ జోన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్‌ను ఏమాత్రం లెక్కచేయలేదు. ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. దీంతో తిలక్ వర్మ సిరాజ్‌ను దాడి నుంచి తప్పించాల్సి వచ్చింది.
మరోవైపు వైభవ్‌తో కలిసి అభిమన్యు ఈశ్వరన్ కూడా ధాటిగా ఆడాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. వైభవ్ మరో భారీ స్కోర్ చేసేలా కనిపించాడు. అదే సమయంలో తిలక్ (Tilak Varma) నేరుగా వైభవ్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. స్టంప్ మైక్‌లో తిలక్ చేసిన వ్యాఖ్యలు కూడా వినిపించాయి. వైభవ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తిలక్ అతడిని కవ్వించేలా మాట్లాడినట్లు తాజా రిపోర్టులు వెల్లడించాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ నవ్వుతూ కనిపించడంతో ఆ సంభాషణ సరదా స్లెడ్జింగ్గానే కనిపించింది.
కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్ వచ్చింది. వైభవ్ 44 పరుగుల వద్ద చామా వి. మిలింద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 బంతుల్లో 44 పరుగులు చేసిన అతడు ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. మరోసారి హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి ఆగిపోయాడు. వైభవ్‌కు ఇది మరోసారి నిరాశే. సెమీఫైనల్లో 92 పరుగులు చేసి సెంచరీకి చేరువగా వెళ్లిన అతడు.. ఫైనల్లోనూ మంచి ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మార్చుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడి దూకుడు బ్యాటింగ్ ఈ ఇన్నింగ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

