కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఈఈ, డీఈ, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. దుబ్బాక పట్టణ పరిధిలోని చెరువుల అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యే ఆరా తీశారు. చెరువుల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, వాటిని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
చెరువుల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం దెబ్బతినకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువు కట్టల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నందున చెరువులు, కాలువలు, డ్రైనేజీలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయాలని, నీరు నిలిచే ప్రాంతాలను తక్షణమే గుర్తించి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

