కలం, నాగార్జునసాగర్: నందికొండ (Nandikonda) మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు ప్రజలు (6th Ward Residents) వరుస సమస్యలతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పందుల కళేబరాలు, కొండచిలువ సంచారం, వీధి కుక్కల దాడులతో ప్రజలు రాత్రివేళల్లో సైతం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజా ఆరోగ్యం, భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిల్ కాలనీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల సమీపంలో ఒక్కరోజే 15 పందులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతి చెందిన పందుల కళేబరాలను అధికారులు సకాలంలో తొలగించకపోవడంతో పరిసర ప్రాంతాలలో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇదే ప్రాంతంలో రెండు రోజుల క్రితం భారీ కొండచిలువ సంచరించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో రాత్రివేళల్లో బయటకు రావాలంటేనే స్థానికులు జంకుతున్నారు. ఇక వీధి కుక్కల బెడద కూడా తీవ్రంగా మారింది. నాలుగు రోజుల క్రితం వీధి కుక్కలు ఓ చిన్నారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. రోజురోజుకూ కుక్కల సంఖ్య పెరుగుతుండటంతో పిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరో వార్డు ప్రజలు మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని డిమాండ్ చేస్తూ నందికొండ మున్సిపల్ కార్యాలయానికి తరలివెళ్లారు. కమిషనర్ సమావేశంలో ఉండటంతో వార్డు ఆఫీసర్ చెన్నుమల్లును కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పందుల కళేబరాలను తక్షణమే తొలగించాలని, వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని స్థానికులు అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

