కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ (Narayankhed) నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాలలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి (Drinking Water) కష్టాలు పెరుగుతున్నాయి. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలంలో రాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉంటాయి. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 8 మండలాల్లో దాదాపు 120 గ్రామాలు, 200 వరకు తండాలు ఉన్నాయి. ఈ ప్రాంత గ్రామాలు, తండాల్లో ఈ సంవత్సరం వేసవి కాలంలో నీటి కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఈసారి ఉన్న పరిస్ధితుల వల్ల మార్చి నెలలోనే నీటి సమస్య మొదలవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరా సవ్యంగా లేకపొవడంతో ప్రజలు రోడ్లెక్కి ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
నారాయణఖేడ్ (Narayankhed) నియోజకవర్గానికి మంజీరా నదిపై ఉన్న సింగూరు ప్రాజెక్టు నుండి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు వద్ద గల పెద్దరెడ్డి పేట ఇక్ టెక్ వేల్ నుండి నీటి సరఫరా చేస్తారు. సింగూరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేసి,వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాలకు, పట్టణానికి పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి భగీరథ ఇన్ ట్రా లైన్లను గ్రామాలకు, తండాలకు వేసి మంచినీటి అందించేవారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
కర్ణాటక రాష్ట్రం నుండి మంజీరా నది నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఖేడ్ ప్రాంతంలోని చాల గ్రామలు మంజీరా నదికి పరివాహంగా ఉంటాయి. మంజీరా నది పైనే తాగునీటి అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టును నిర్మాణం చేశారు. అయితే ప్రసుత్తం నిపుణుల సూచనల మేరుకు సింగూర్ డ్యామ్ భద్రత కోసం మరమ్మతుల చేస్తున్నారు. దీంతో కేవలం తాగునీటి కోసం మాత్రమే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి ,మిగిలిన నీటిని దిగువనకు విడుదల చేశారు. నీరు మొత్తం మంజీరా నది నుండి కిందకు వదిలివేయడంతో మంజీరా పరివాహ ప్రాంతాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో పూర్తిగా తాగునీటి కోసం మిషన్ భగీరథ సరఫరా చేసే నీటి మీదనే ఆధారపడే పరిస్ధితి వచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుండి తాగునీటి కోసం దాదాపు 7 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
అయితే మిషన్ భగీరథకు సంబంధించి సరైన నిర్వహణ లేకపోవడంతో తాగునీటి సకాలంలో రావడం లేదు. రాష్ట్ర రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న నాగల్ గిద్ద మండం నుండి నారాయణ ఖేడ్ పక్కనే ఉన్న సిర్గాపూర్ మండలంలోనూ సకాలంలో తాగునీటి సరఫరా కాకపొవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగల్ గిద్ద మండలం కొండా నాయక్ తండాకు నల్లాల ద్వారా నీటి సరఫరా కాకపోవడంతో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి నీటి చెలిమె నుండి బిందెల ద్వారా మోసుకొని వెళ్తున్నారు. నియోజకవర్గ కేంద్రానికి దగ్గరగా ఉన్న మేజర్ గ్రామ పంచాయితీలు అబ్బెంద, చాప్టా, ఉజలంపాడులో కుడా తాగునీటి సరఫరా సరిగా కావడం లేదు. సిర్గాపూర్ మండలం జీవుల తాండవాసులు మంచి నీటి సరఫరా గత నెల రోజుల నుండి కావడం లేదని రోడ్డుపై ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
నిర్వహణ లోపమే… అసలు సమస్యా!
ఇలా మిషన్ భగీరథ ద్వారా నియోజకవర్గంలోని గ్రామాలకు, తండాలకు నీటి సరఫరా కోసం సింగూరు ప్రాజెక్టు నుండి మెయిన్ లైన్లు, పంపింగ్ స్టేషన్లు ఒవర్ హెడ్ ట్యాంకులు, హౌస్ కనెక్షన్లు ఉన్నవి కానీ వాటిని సరైన రీతిలో నిర్వహణ లేని కారణంగా ఖేడ్ ప్రాంతంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. సింగూరు ప్రాజెక్టు వద్ధ తాగునీటికి సరిపడా నీరు అందుబాటులో ఉన్నప్పటికి.. వాటికి ప్రణాళికాబద్ధంగా నిర్వహించకపొవడంతో సమస్యలు వస్తున్నయని చెబుతున్నారు. అధికారుల అలసత్వం, నిర్వహణ లోపం ఫలితంగా నారాయణ ఖేడ్ పట్టణం సమీప గ్రామాల నుండి మొదలు… సరిహద్దు ప్రాంతాల్లోని తండాల్లో తాగునీటి కోసం ప్రజలు ప్రతిరోజూ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు నీటి సరఫరా సక్రమంగా చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నారాయణ ఖేడ్ ప్రాంత తాగునీటి సరఫరాపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమీక్ష సమావేశం నిర్వహించి.. ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్వహణ సరిగా జరిగి, సక్రమంగా నీటి సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా తాత్కలికంగా తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, కొత్త బోర్లు తవ్వించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే రాబోయే వేసవిలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నారాయణ ఖేడ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

