కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని (Gold Seizure) డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డీఆర్ఐ) అధికారులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. హైవే పై కోల్‌కతా నుండి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న సుమారు రూ. 8.98 కోట్ల విలువైన 5.83 కిలోల విదేశీ బంగారాన్ని సినిమా స్టైల్‌లో వెంబడించి పట్టుకున్నారు. కారులోని ముందు వైపు ప్రయాణికుల సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య ఖాళీ ప్రదేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన మూడు ప్యాకెట్ల బంగారాన్ని భద్రపరిచినట్లు పోలీసులు తేల్చారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా ఈ అక్రమ రవాణా జరిగినట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీంతో 1962 కస్టమ్స్ చట్టం కింద బంగారాన్ని సీజ్ చేసి, ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

