కలం, సోన్ : సోన్ మండలం లోకల్ వెల్మల్ (Local Velmal) గ్రామంలో రైతులకు చెందిన మొక్కజొన్న సంచులను చోరీ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పోశెట్టి, హరీష్, సాయన్న అనే ముగ్గురు రైతులు తమ మొక్కజొన్న పంటను ఆరబెట్టి సంచుల్లో నింపి గ్రామంలో ఉంచారు. ఈ క్రమంలో బైంసాకు చెందిన మహమ్మద్ ఆఫన్, మహమ్మద్ సాహిల్ ఉద్దీన్, నిర్మల్ పట్టణానికి చెందిన అకిఫ్ ఖాన్, మహమ్మద్ అజహార్, మహమ్మద్ జునైద్ కమల్‌లు బైంసా పట్టణంలోని ఇఫ్తేకర్ అనే వ్యక్తి వద్ద టీఎస్ 18 టీ 1942 నంబరు గల బొలెరో వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు.
ఈ నెల 7న రాత్రి లోకల్ వెల్మల్ గ్రామానికి చేరుకున్న నిందితులు ముగ్గురు రైతులకు చెందిన 76 మొక్కజొన్న సంచులను అపహరించారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైతుల పంట చోరీకి గురికావడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. చోరీ చేసిన మొక్కజొన్న సంచులను కామారెడ్డిలో విక్రయించేందుకు నిందితులు వెళ్తుండగా, ఆదివారం మాదాపూర్ గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో మొక్కజొన్న బస్తాలు (Maize Bags) కనిపించాయి. నిందితులను విచారించగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని సీఐ తెలిపారు.ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ దేవన్న, పోలీసు సిబ్బంది భాస్కర్, రాజ్ కుమార్, రవి, శ్రీనివాస్, వినోద్, సాయి కృష్ణ, వెంకటరమణ, గంగన్న పాల్గొన్నారు.

