epaper
Sunday, February 22, 2026
epaper

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్‌… సైనిక చ‌ర్య‌ల‌కు సిద్ధం

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌ (Iran)కు ఇంకా 10 నుంచి 15 రోజుల గడువు మాత్రమే ఉందని తెలిపారు. లేకపోతే సైనిక చర్యలు తప్పవని సూచించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది జూన్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరగడం వల్లే గాజాలో కాల్పుల విరమణ సాధ్యమైందని ట్రంప్‌ అన్నారు.

ఇరు దేశాలు ఒక ఒప్పందం చేసుకోవాల‌ని, లేదంటే పరిణామాలు తీవ్రమవుతాయ‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. రానున్న‌ 10 రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత పరోక్ష చర్చలు జరిగాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అఘాచి మాట్లాడుతూ జెనీవాలో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని, కొన్ని మార్గదర్శక సూత్రాలపై విస్తృత అంగీకారం కుదిరిందని తెలిపారు. అయితే అమెరికా గల్ఫ్ ప్రాంతంలో తన సైనిక బలగాలను పెంచుతోంది. రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, పలు యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది.

ఇరాన్ తాము అణ్వాయుధాలు తయారు చేయడం లేదని స్పష్టం చేసింది. యురేనియం శుద్ధిని తగ్గించి అంతర్జాతీయ పర్యవేక్షణకు సిద్ధమని చెప్పింది. కానీ ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్నది అమెరికా డిమాండ్. అదేవిధంగా క్షిపణి కార్యక్రమంపై కూడా పరిమితులు విధించాలని అమెరికా కోరుతోంది. దీనికి ఇరాన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ కామేనేని అమెరికా హెచ్చరికలపై స్పందిస్తూ అమెరికా యుద్ధనౌకలను పంపుతోంద‌ని, అవి ప్రమాదకరమైనవే కానీ వాటిని సముద్ర గర్భంలోకి పంపే శక్తి ఇంకా ప్రమాదకర‌మని వ్యాఖ్యానించారు.

2018లో తన మొదటి పదవీ కాలంలో ట్రంప్, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికాను వైదొలగించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నప్పటికీ, పరస్పర ఆరోపణలు, హెచ్చరికలు తగ్గడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>