కలం, జోగులాంబ గద్వాల: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు జూరాల డ్యామ్ పర్యటనను పురస్కరించుకుని గద్వాల (Gadwal) లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ పార్టీ యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి (DK Snigdha Reddy) తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలు పూర్తిగా అక్రమమని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడమేనని ఆమె మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా స్నిగ్ధ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాములు, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి తదితరులను వారి నివాసాల్లోనే హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా స్నిగ్ధ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని చెప్తున్న ప్రభుత్వం, పోలీస్ పహారాలు, నిర్బంధాలతో పాలన సాగించడం ఏంటని ప్రశ్నించారు. “ప్రజా ప్రభుత్వం” అని బీరాలు పలికే నాయకులు, ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ఆంక్షలు విధించడం వారి బలహీనతకు నిదర్శనమని నిలదీశారు. రైతుల సమస్యలపై, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను అరెస్టులతో భయపెట్టలేరని స్పష్టం చేశారు.

