కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీకి చెందినవారమో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని.. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ రాజీనామా చేయించాలి..
మళ్లీ గెలుస్తామనే నమ్మకం కాంగ్రెస్‌కు ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో తక్షణమే రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, సిగ్గు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందని దుయ్యబట్టారు.
ఓటమి భయం పట్టుకోవడంతోనే..
రానున్న ఖైరతాబాద్ బైపోల్ లో ఓటమి భయం పట్టుకోవడంతోనే.. ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని డీకే అరుణ ఆరోపించారు. గతంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ లో బీజేపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
ఖైరతాబాద్‌లో బీజేపీ విజయం ఖాయం..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఎటువంటి పక్షపాతం చూపకుండా రాష్ట్ర అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తున్నారని డీకే అరుణ అన్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటి పాలనను చూశారని.. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు వేర్వేరు కాదని.. రెండూ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్న ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని చెప్పుకొచ్చారు.

