కలం, జోగుళాంబ గద్వాల: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, సాగు చేసిన ఆరుతడి పంటలను (Crops) కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగుంటి బోర్ల నుంచి నీరు రాక ఎండిపోతుండటంతో, ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటలను తడిపే దుస్థితి దాపురించింది.
జోగులాంబ గద్వాల మండలం మదనపల్లి శివారుకు చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న 10 ఎకరాల పొలంలో పత్తి, కంది పంటలను సాగు చేశారు. అయితే వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే పత్తి పంట పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న కంది పంటనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటకు పారిస్తున్నారు.
ఇప్పటివరకు సాగు పెట్టుబడుల రూపంలో రూ.2 లక్షల వరకు ఖర్చు చేశానని, ఇప్పుడు పంటను బతికించుకోవడానికి రోజుకు వాటర్ ట్యాంకర్లకే అదనంగా రూ.6,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఎండిపోతున్న పంటలను కాపాడటంతో పాటు నష్టపోయిన రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

