కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యా రంగ నిర్వహణలో మార్పులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించి, అందుకు విద్యాశాఖ సమాయత్తం కావాలని ఆదేశించడం విలువైన సమయాన్ని వృథా చేయడమేనని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి(Raghavachari) విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతేడాది కూడా ఇలాంటి ప్రకటన చేశారని, ఆ తర్వాత వాయిదా వేశారని తెలిపారు. ఏడాది పాటు కాలం గడిపి ఇపుడు మళ్లీ అదే విషయాన్ని చెప్పి ఈ సారి తప్పని సరిగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తామని, ఇంటర్ బోర్డు రద్దు చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు.
ఈ చర్య అవసరం అని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంటే, దీని వల్ల విద్యా రంగానికి ప్రయోజనం ఉంటే ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరిపి, ప్రజలను మెప్పించి ప్రజా భాగస్వామ్యంతో ఈ పని చేయవచ్చునని తెలిపారు. విద్యా రంగంలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉండే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యాభివృద్ధిని కోరే అభిమానులు ఎందరో ఉన్నారని, వారి ఆలోచనలు తీసుకోకుండా విధానం ప్రకటించి ఏకంగా అమలుకు ముందుకు రావడంలో నిజాయితీ ప్రశ్నగా ఉంటుందని ఆయన అన్నారు.
విద్యను, ప్రత్యేకించి ఇంటర్ విద్యను మూడు, నాలుగు విద్యా సంస్థలు తమ దోపిడీకి సాధనంగా చేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ముందు పాఠశాల స్థాయి తరగతులను కూడా అందుకు అనువుగా మలిచి ఉపయోగించుకుంటారని తెలిపారు. తలిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు మరింత దోపిడీకి గురివుతారన్నారు. విద్యార్థులు కనీస స్వేచ్ఛ లేని మర బొమ్మలుగా రూపొందుతారని, విద్యా రంగ ప్రైవేటీకరణ వల్ల కొత్త పరిశోధనలు దెబ్బ తింటాయన్నారు.
ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశ పెట్టబోయే విధానం ఏమిటో, అది వివరంగా ప్రజల ముందుకు శ్వేత పత్రం ద్వారా వివరించాలని డిమాండ్ చేశారు. కేశవరావు వంటి వారు విద్యారంగ సమస్యలపై అవగాహనతో చర్చను నిర్వహించలేరని, మారుతున్న పరిస్థితులు ఆయనకు తెలియవని, విద్యార్థి యువజన, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు విద్యా రంగ భవిష్యత్తు కోసం విస్తృతంగా చర్చ చేయాలని ఆయన వివరించారు.

