కలం, ఖమ్మం బ్యూరో: ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చి, దళిత వాడల రూపురేఖలు మారుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలంలో రూ.12.89 కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారులు, ఎస్సీ కాలనీల అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఎర్రుపాలెం నుంచి జమలాపురం వరకు రూ.5.35 కోట్లతో బీటీ రహదారి, ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో రూ.55 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. రామాపురం నుంచి కొత్తపాలెం వరకు రూ.6.15 కోట్లతో బీటీ రహదారి, రామాపురం ఎస్సీ కాలనీలో రూ.13 లక్షలతో సీసీ రోడ్ల పనులతో పాటు రెమిడిచర్లలోని ఎస్సీ కాలనీలో రూ.71 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

