కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ (Drug Racket) బట్టబయలైంది. స్నాప్ చాట్ (Snapchat) కేంద్రంగా జరుగుతున్న ఈ డ్రగ్స్ దందాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. బుధవారం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 1.240 కిలోల గంజాయి, 16.59 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు మొబైల్ ఫోన్స్, ఒక కారును కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా కోసం నిందితులు OGdude420, Dude OG 420 అనే స్నాప్‌చాట్ అకౌంట్లను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెట్వర్క్ ద్వారా సుమారు 800 నుంచి 900 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.
డిజిటల్ మనీ లావాదేవీల కోసం యూఎస్డీటీ క్రిప్టోకరెన్సీని, రెడోట్పేను వినియోగించినట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. సుమారు 60 మంది కస్టమర్లతో 150 లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ముంబై నుంచి డ్రగ్స్ సేకరించి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ ఫరహాన్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో కొందరికి గతంలోనూ ఎన్డీపీఎస్ కేసుల్లో నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

