కలం, ఆదిలాబాద్: జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) అన్నారు. సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐఆర్‌సీఎస్ ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా పలు అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.
సంస్థ ద్వారా ప్రజలకు వైద్య సేవలు, రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిరంతరం అందేలా చూడాలన్నారు. నూతన బ్లడ్ బ్యాంక్ మంజూరు, సంస్థ నిర్వహణ పారదర్శకతపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కైలాస్‌నగర్ వైట్ క్వార్టర్స్‌లో శిథిలావస్థకు చేరిన రెడ్ క్రాస్ భవనానికి తాత్కాలిక మరమ్మతులు లేదా నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వ కేటాయించిన స్థలంలో వసతులు కల్పించడంపై చర్చించారు. అనంతరం సభ్యులకు రెడ్ క్రాస్ గుర్తింపు కార్డులను కలెక్టర్ అందజేశారు.

