కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు (Patharlapadu) మాజీ సర్పంచ్ సామినేని రామారావు (72) హత్య కేసును పోలీసులు ఛేదించారు. శాస్త్రీయ దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాలతో నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. 2025 అక్టోబర్ 31 తెల్లవారుజామున రామారావును ఆయన ఇంటి పక్కన ఉన్న షెడ్డులో హత్య చేశారు. ఘటనాస్థలంలో చెప్పులు, పాదముద్రలు, వస్త్రపు ముక్కలు, కత్తి కవర్ వంటి ఆధారాలను పోలీసులు సేకరించారు. దర్యాప్తులో భాగంగా 24 మందికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి కోరగా, ఆరుగురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరికి 2026 జనవరిలో బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు. గుజరాత్లోని గాంధీనగర్ జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ నిపుణులు ఖమ్మంలో ఆధారాలను విశ్లేషించారు. ఈ నివేదికలను ఇతర ఆధారాలతో సరిపోల్చి కీలక వివరాలను గుర్తించారు.
ఈ కేసులో తల్లంపల్లి గ్రామానికి చెందిన బోడపట్ల శ్రీనివాసరావు అలియాస్ మోంటల్ శ్రీను (34), నూకల లింగయ్య (43), మల్లారపు లక్ష్మయ్య (24), కార్లపూడి ఉదయ్ కుమార్ అలియాస్ రుక్మన్ కుమార్ (39)లను అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు కత్తులు, రెక్కీకి వినియోగించిన నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వైరా ఏసీపీ ఎస్. సారంగపాణి పర్యవేక్షణలో, వైరా సీఐ వై. వెంకట ప్రసాద్ దర్యాప్తు చేపట్టగా ఎస్సైలు వీరేందర్, జి. నరేష్ సహకరించారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించి రివార్డులు అందించారు.

