కలం, నాగర్కర్నూల్: ఏళ్ల తరబడి ప్రజలకు వైద్య సేవలందిస్తూ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల (NHM Employees) జీవితాల్లో నెలకొన్న అభద్రతను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఉద్యోగులు వినూత్న రీతిలో స్కిట్ ప్రదర్శించారు. ఒక ఎన్ హెచ్ ఎం ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి బీమా భరోసా ఏది? ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు?” అనే ప్రశ్నలతో ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు తగిన బీమా రక్షణ, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ కల్పించాలని ఈ స్కిట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగి మరణంతో కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తుపై నెలకొనే అనిశ్చితిని భావోద్వేగభరితంగా ప్రదర్శించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే మాకు.. మా కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఏది?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, వారికి, వారి కుటుంబాలకు తగిన భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరారు.

