కలం, స్పోర్ట్స్ : చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ (CSK Head Coach) ఎవరన్నదే ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ రేసులో మాజీ భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) పేరు తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, సీఎస్కే మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్.. కార్తీక్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేయాలనే అభిప్రాయానికి మద్దతు తెలిపారు. సీఎస్కే వంటి ప్రతిష్ఠాత్మక జట్టుకు స్థానిక నేపథ్యం, పరిస్థితులపై అవగాహన ఉన్న కోచ్ అవసరమని హేడెన్ పేర్కొన్నారు. దినేశ్ కార్తీక్‌కు చెన్నైతో ఉన్న అనుబంధం, అతడి క్రికెట్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
16 ఏళ్ల ఫ్లెమింగ్ శకం ముగింపు
సీఎస్కే హెడ్ కోచ్‌గా దాదాపు 16 ఏళ్ల పాటు సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇటీవల తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో సీఎస్కే ఐదు ఐపీఎల్ టైటిళ్లతో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లను సాధించింది. ఫ్లెమింగ్, కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కలిసి సీఎస్కేకు ఎన్నో విజయాలు అందించారని హేడెన్ గుర్తు చేశారు. ఫ్లెమింగ్ తప్పుకోవడం ధైర్యమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇప్పుడు జట్టు భవిష్యత్తు కోసం సరైన కోచ్‌ను ఎంపిక చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కార్తీక్‌కు కోచింగ్ అనుభవం
ప్రస్తుతం దినేశ్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా కొనసాగుతున్నారు. ఆర్సీబీ సహాయక బృందంలో ఉన్న సమయంలో జట్టు వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు సాధించిందని హేడెన్ పేర్కొన్నారు. ఈ అనుభవం సీఎస్కేకు కూడా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దినేశ్ కార్తీక్‌కు చెన్నైతో ఉన్న స్థానిక అనుబంధం మరో సానుకూల అంశమని హేడెన్ అన్నారు. చెన్నై క్రికెట్ వాతావరణం, అభిమానుల అంచనాలు, జట్టు సంస్కృతిపై కార్తీక్‌కు మంచి అవగాహన ఉందని పేర్కొన్నారు. అయితే దినేశ్ కార్తీక్‌ను సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా నియమిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. కొత్త కోచ్ ఎంపికపై జట్టు యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

