కలం, సినిమా : నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ పై అడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘అఖండ 2’ తో కొంత నిరాశ కలిగించినప్పటికీ .. మళ్లీ తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ కాంబినేషన్ రెడీ అవుతోంది. ఈ మేరకు బాలకృష్ణతో చేయనున్న మూవీపై డైరెక్టర్ బోయపాటి శ్రీను అనౌన్స్ చేశారు.
నేడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం బోయపాటి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. తాను త్వరలో బాలకృష్ణతో ‘అఖండ-3’ మూవీని చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. బాలకృష్ణతో కలిసి ఈ ప్రాజెక్టును సరైన సమయంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు కాకుండా, కొంత గ్యాప్ ఇస్తూ వెల్లడిస్తానని.. అలా అయితేనే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుందని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ‘అఖండ-3’ మూవీపై బోయపాటి అనౌన్స్ మెంట్ పై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘అఖండ-3’ తో ఈ కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేస్తుందని భావిస్తున్నారు.

