కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి జనాభా లెక్కల (Census) సేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈసారి పూర్తి డిజిటల్ పద్ధతిలో ఈ ప్రక్రియలో జరుగుతోంది. తొలి దశలో ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు మే 10 వరకు అవకాశం కల్పించారు. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ రానున్నారు. వీరు స్మార్ట్‌ఫోన్లలోని ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా నివాస గృహాల వివరాలను సేకరిస్తారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండానే 33 రకాల ప్రశ్నలతో ఈ గణన సాగనుంది. ఈ కార్యక్రమం వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
జనాభా గణన (Census) ప్రక్రియ కేవలం ప్రజల సంఖ్యను లెక్కించడం మాత్రమే కాకుండా, దేశ సామాజిక-ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే సర్వేగా నిలుస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా సేకరించిన ప్రజల వయస్సు, విద్య, ఉపాధి, నివాస ప్రాంతం వంటి వివరాలు భవిష్యత్తులో ప్రభుత్వాలు రూపొందించే సంక్షేమ పథకాలకు పునాదిగా మారుతాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో నిధుల కేటాయింపులకు, ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజనకు ఈ గణాంకాలే అత్యంత కీలకం. రాబోయే తరాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో సెన్సస్ కీలకంగా పనిచేస్తుంది.

