కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ (Dharmapuri Temple) పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం మార్పులు ఉన్నాయని శృంగేరి పీఠాధిపతి జగద్గురులు అన్నారు. ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనుల అనుమతి కొరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో శ్రీనివాస్‌తో ధర్మపురి అగ్రహారం పెద్దలు సోమవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు స్వాముల వారిని సోమవారం దర్శించుకొని ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి పునరుద్ధరణ కోసం చేపడుతున్న పనులను వివరించారు.
ఈసందర్భంగా ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ జీర్ణోద్ధరణకు సంబంధించిన పత్రాలను జగద్గురులకు అందజేశారు. ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ శాస్త్ర, సాంప్రదాయాల ప్రకారం ఉందని నిర్మాణ పనులు ప్రారంభించాలని జగద్గురు స్వాములవారు అనుమతి ఇచ్చినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ధర్మపురి లోని ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం ఇటీవల రూ. 10 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇటీవల భూమి పూజ పనులు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనుల అనుమతి కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శృంగేరి చేరుకున్న బృందం సభ్యులు ఆలయ విస్తరణకు శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం చేపడుతున్న పనులను జగద్గురువులకు వివరించారు. ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం ఉన్నాయని పనులు ప్రారంభించి వచ్చే గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేయాలని జగద్గురులు సూచించారు.
ధర్మపురిలోని శ్రీ యోగా నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని జగద్గురులు సూచించగా 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల అనంతరం యోగా నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చేపడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ జగద్గురువులకు వివరించారు. శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి అయిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని జగద్గురులను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు.
మంత్రి ఆహ్వానం మేరకు ఉగ్ర నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తానని జగద్గురులు మాట ఇచ్చారు. శ్రీ యోగ నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులను గోదావరి పుష్కరాలు ముగిసిన వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా జగద్గురులు మంత్రి లక్ష్మణ్ కుమార్ ని ఆదేశించారు.
జగద్గురుల ఆదేశాలతో పుష్కరాల అనంతరం నిధులు మంజూరు చేయించి శ్రీ యోగా నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు సైతం చేపడతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాలను జగద్గురులు అందజేశారు. ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడంతో పనులు ఊపందుకోనున్నాయి.

