కలం, తెలంగాణ బ్యూరో : అజ్ఞాత జీవితంలోని నక్సలైట్ (Naxalite) లీడర్లు, కేడర్ లొంగిపోయేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని (Rehabilitation Policy) సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) మాజీ మావోయిస్టు (Maoist) దేవ్‌జీ (Devji) విజ్ఞప్తి చేశారు. ఒక్కో ర్యాంకులో ఉన్న మావోయిస్టుకు ఒక్కో రకమైన రివార్డును ప్రభుత్వం ఫిక్స్ చేసిందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. గరిష్ట స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రివార్డు రూ. 25 లక్షలుగా ఉన్నదని, దీన్ని కోటి రూపాయలకు పెంచాలని సీఎంకు రిక్వెస్టు చేశారు. రెండు రోజుల క్రితం లొంగిపోయిన నలుగురు మావోయిస్టులతో పాటు సుజాతక్క, పుల్లూరి ప్రసాదరావు సచివాలయానికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి వారి సమస్యలను వివరించారు.
ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూముల్లేవ్ : సీఎం
లొంగిపోతున్న మావోయిస్టులకు రివార్డు ప్రైజ్‌తో పాటు ఐదు ఎకరాల భూమిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రికి దేవ్‌జీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భూముల్లేని కారణంగా దాన్ని ఇవ్వలేమని సీఎం బదులిచ్చినట్లు మీడియా ప్రతినిధులకు దేవ్‌జీ వివరించారు. లొంగిపోయిన తర్వాత బతకడానికి వీలుగా ఉపాధి అవకాశాలను కల్పించాలని, ప్రతి నెలా ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ఇవ్వాలని కూడా కోరినట్లు తెలిపారు. ఈ రెండింటికీ సీఎం సానుకూలంగా స్పందించి, నివాస అవసరాలకు ఇంటితో పాటు ఉద్యోగాన్ని కల్పిస్తామన్నారని, జీవన భృతిపైనా హామీ ఇచ్చారని తెలిపారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ పేరుతో ప్రాణాలను తీయడానికి బదులు లొంగిపోయేందుకు మార్గం కల్పించి సహకరించిన పోలీస్ ఆఫీసర్లకు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్లు దేవ్‌జీ వివరించారు.
పోలీసులతో ఎలాంటి ఇబ్బంది రాలేదు :
మావోయిస్టు ఉద్యమాన్ని, అజ్ఞాత జీవితాన్ని వదిలి ప్రభుత్వానికి లొంగిపోవాలని తాము తీసుకున్న నిర్ణయానికి పోలీసు అధికారుల నుంచి కూడా సానుకూల స్పందన, సహకారం అందిందని ఒక ప్రశ్నకు సమాధానంగా దేవ్‌జీ బదులిచ్చారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి తమను బాగానే చూసుకున్నారని, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. కొన్ని అంశాలను వారితో చర్చించినప్పుడు విధానపరమైన నిర్ణయాలు కావడంతో అవి ప్రభుత్వ పరిధిలోకి వచ్చేవని అర్థం చేయించారని, దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామన్నారు.
ఈ రోజుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదు :
ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో సాయుధ పోరాటం, ఆయుధం పట్టుకోవడంతో మార్పు సాధ్యం కాదని దేవ్‌జీ నొక్కిచెప్పారు. దీనిపై ప్రజలకు కూడా విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని, తొలుత జైళ్లలో ఉన్న మావోయిస్టు కేడర్‌ను కలిసి మాట్లాడతామని, ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. జైళ్లలో ఉన్న మావోయిస్టు లీడర్లు కేడర్‌ను కలిసి మాట్లాడి సంఘటితంగానే దేశ ప్రజలందరికీ లేఖ రాస్తామని తెలిపారు. ముఖ్యమంత్రితో భేటీపై దేవ్‌జీ (Devji) సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్
Follow Us On: Youtube

