కలం, వెబ్ డెస్క్ : రాజ్యసభలో రిటైరింగ్ ఎంపీల ఫేర్‌వెల్ సెషన్‌లో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఖర్గే తన ఫేర్ వెల్ ప్రసంగంలో మాజీ ప్రధాని హెచ్.డీ దేవెగౌడ (H.D Deve Gowda) పై హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. “నేను హెచ్.డీ దేవెగౌడ గారికి 54 ఏళ్లుగా తెలుసు. చాలా రోజులు కలిసి పని చేశాను. కానీ ఏమైందో తెలియదు.. మాతో ప్రేమలో ఉండి. చివరకి ఆయన.. ప్రధాని మోదీని వివాహం చేసుకున్నారు’ అని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. ప్రధాని మోడీ కూడా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వైరల్ అవుతున్నాయి.
దీనిపై మాజీ ప్రధాని దేవెగౌడ (H.D Deve Gowda) స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ లేఖను పోస్ట్ చేశారు. ‘నేను సభలో లేనప్పుడు మల్లి కార్జున ఖర్గే హాస్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ తో తాను ప్రేమలో ఉన్నానని.. బీజేపీతో పెళ్లి చేసుకున్నానని అన్నారు. కానీ, అది బలవంతంగా జరిగిన పెళ్లి అని.. ఆ పెళ్లి తరువాత అబ్యూసివ్ రిలేషన్ షిప్ గా మారింది’ అంటూ 2018 లో కర్ణాటకలో ఏర్పడిన ఏర్పడిన JD(S)-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 2019 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మళ్లడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిందని, అందువల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, హెచ్.డీ దేవెగౌడ పోస్ట్ తో కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య ఉన్న సంబంధాలు, ‘ఆపరేషన్ కమల్’ వంటి ఘటనలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

