ఈనెల 30న ఖమ్మంలో సీఎం పర్యటన.. సభా స్థలాన్ని ఖరారు చేసిన భట్టి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 30వ తేదీన ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్వయంగా సభా స్థలాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు.

​మండల పరిధిలోని లచ్చగూడెం, జగన్నాధపురం, మత్కేపల్లి స్టేజీ పరిసర ప్రాంతాల్లో సభ నిర్వహణకు అనువైన స్థలాలను అధికారులతో కలిసి ఆయన కూలంకషంగా పరిశీలించారు. చివరకు రవాణా, భద్రతా పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న జగన్నాధపురం స్థలాన్ని బహిరంగ సభ నిర్వహణ కోసం భట్టి ఖరారు చేశారు.

​ఈ పర్యటన రాష్ట్ర రైతులకు అత్యంత కీలకం కానుంది. ఈ నెల 30వ తేదీన జరిగే ఇదే బహిరంగ సభా వేదికపై నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ‘రైతు భరోసా’ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి చింతకాని వేదిక కానుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

​సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా ఎస్పీ సునీల్ దత్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>