రైతు సంక్షేమం.. భూ చిక్కులకు పరిష్కారం : బాలు నాయక్

కలం, దేవరకొండ: రైతుల సంక్షేమం, భూ సమస్యల శాశ్వత పరిష్కారం, పేదలకు ఆత్మగౌరవంతో కూడిన నివాసం, చిన్నారులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) ఉద్ఘాటించారు. బుధవారం చింతపల్లి మండల కేంద్రంతో పాటు ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండల కేంద్రంలోని శివ సాయి కాటన్ జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని బాలు నాయక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Balu Naik) మాట్లాడుతూ.. రైతులు దళారుల బారిన పడకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల ద్వారానే తమ పంటను విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి, పత్తిలో తేమ శాతాన్ని తగ్గించి తీసుకురావాలని కోరారు. కేంద్రంలో ప్రదర్శించిన ధరల పట్టిక ప్రకారం పత్తి రకాన్ని బట్టి క్వింటాలుకు రూ.8,567 నుండి రూ.8,667 వరకు ధర నిర్ణయించినట్లు వెల్లడించారు. అనంతరం ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ‘భూ భారతి’ చట్టం భూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని తెలిపారు. భూ సరిహద్దు వివాదాలు, రికార్డుల్లోని వ్యత్యాసాల పరిష్కారానికి ఈ సర్వే దోహదపడుతుందన్నారు.

అర్హతలకు అనుగుణంగా ప్రతీ భూకమతానికి ఎల్‌పీఎమ్ నంబర్లను కేటాయిస్తారని వివరించారు. రైతులందరూ తమ భూ పత్రాలను సిద్ధంగా ఉంచుకొని సర్వే అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పరపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. సొంతిల్లు పేదలకు ఆత్మగౌరవంతో కూడిన భద్రతను ఇస్తుందన్నారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>